రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ తటస్థ వైఖరిని అవలంభించింది. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో చేపట్టిన తీర్మానంపై భారత్ మరోసారి తటస్థంగా వ్యవహరించింది. ఉక్రెయిన్‌లో తక్షణమే యుద్ధాన్ని నిలిపివేసి, శాంతిని నెలకొల్పాలని పేర్కొంటూ సాధారణ సభలో రష్యాకు వ్యతిరేకంగా ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా.. భారత్ సహా 32 దేశాలు గైర్హాజరయ్యాయి. ‘ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతికి అంతర్లీనంగా ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలు’ పేరుతో చేపట్టిన తీర్మానికి అనుకూలంగా 141, వ్యతిరేకంగా 7 దేశాలు ఓటేశాయి.
చార్టర్‌కు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలకు రెట్టింపు మద్దతు ఇవ్వాలని సభ్యదేశాలు, అంతర్జాతీయ సంస్థలకు తీర్మానం పిలుపునిచ్చింది. అంతర్జాతీయంగా గుర్తించిన సరిహద్దులు లోపల, ప్రాదేశిక జలాలు విస్తరణలో ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతకు తన నిబద్ధతను ఈ తీర్మానం స్పష్టం చేసింది. రష్యా తన సైనిక బలగాలన్నింటినీ పూర్తిగా, బేషరతుగా తక్షణమే ఉక్రెయిన్ భూభాగం నుంచి ఉపసంహరించుకోవాలని తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులు, శత్రుత్వాల విరమణ కోసం పిలుపునిచ్చింది.
గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఐరాసలో పలు తీర్మానాలు చేశారు. సాధారణ సభ, భద్రతా మండలి, మానవహక్కుల కౌన్సిల్‌లో చేపట్టిన తీర్మానాల్లో రష్యా చర్యలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, స్వాతంత్రం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాయి.
ఇదిలావుంటే ఉక్రెయిన్‌పై ఐరాస తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది. అయితే, యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని స్థిరంగా నొక్కి చెబుతోంది. శత్రుత్వాలను తక్షణమే నిలిపివేసి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునే అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా కోరింది. గత సెప్టెంబరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తూ.. ఉక్రెయిన్, రష్యా వివాదంలో శాంతి, చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలనేది తమ వైఖరని పునరుద్ఘాటించారు.
“ఉక్రెయిన్ వివాదంలో మేము ఎవరి పక్షాన ఉన్నామని మమ్మల్ని తరచుగా అడుగుతారు.. మా సమాధానం, ప్రతిసారీ సూటిగా, నిజాయితీగా ఉంటుంది. భారతదేశం శాంతి వైపు ఉంది.. ఈ విషయంలో స్థిరంగా ఉంటుంది. మేము ఐరాస చార్టర్, దాని వ్యవస్థాపక సూత్రాలను గౌరవించే వైపు ఉన్నాం. చర్చలు, దౌత్యమే ఏకైక మార్గంగా మేము పిలుపునిచ్చే వైపు ఉన్నాం’’ అని జైశంకర్ అన్నారు. ఈ సంఘర్షణకు ముందస్తు పరిష్కారాన్ని కనుగొనడంలో ఐక్యరాజ్యసమితి లోపల, వెలుపల నిర్మాణాత్మకంగా పనిచేయడం సమిష్టి ప్రయోజనానికి సంబంధించింది అని స్పష్టం చేశారు.