తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ఉన్నాను అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఇదిలావుంటే పింక్ డైమండ్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో బాగా వినిపించిన పేరు. తాము పింక్ డైమండ్ కొట్టేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. నారా లోకేష్ పాదయాత్రలో హలో లోకేష్ పేరుతో తిరుపతిలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సమయంలో ఈ పింక్ డైమండ్ లొల్లి ఏంటంటూ విద్యార్థి అడిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఆ వీడియోను లోకేష్ ట్వీట్ చేసి ఆరోపణలు చేసినవారిని ప్రశ్నించారు.
‘నేను పింక్ డైమండ్ కొట్టేశానని విజయసాయిరెడ్డి ఆరోపించి నాలుగేళ్లయ్యింది, ఏం పీకారు. ఎన్నికలు అయ్యాక మరిచిపోయారెందుకు? ఆరోపణలు చేయడం తేలిక. పింక్ డైమండ్ ఏమైందో విజయసాయిరెడ్డి చెప్పాలి. వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్లేవారు ఎవరైనా గోవిందా.. గోవిందా. ఏడుకొండలు కాదన్న వ్యక్తి ఏమయ్యారో చూశాం. నేను ఏ తప్పూ చేయలేదు, చేయను కనుకే తిరుపతి నడి వీధుల్లో ధైర్యంగా పాదయాత్ర చేస్తున్నా. తప్పులు చేసి, జనాల్ని మోసం చేసిన వ్యక్తి జనం దాడి చేస్తారనే భయంతో పరదాలు కట్టుకుని భయం భయంగా బయటకొస్తున్నారు’అంటు సెటైర్లు పేల్చారు.
ఈ పింక్ డైమండ్ లొల్లి తనకే అర్థం కావడం లేదన్నారు లోకేష్. చంద్రబాబు పాలనలో తిరుపతి వెంకన్న పింక్ డైమండ్ కొట్టేశామని విజయసాయిరెడ్డి అన్నారని.. వెంకటేశ్వరస్వామి జోలికి వెళితే వాళ్ల పని గోవిందా.. గోవిందా అన్నారు. అన్ని కొండలు ఎందుకు అని మాట్లాడిన వారు ఏమయ్యారో గతంలో చూశామని.. ఎవరైతే తమపై ఆరోపణలు చేశారో ఈ నాలుగేళ్ల వాళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్నికల తర్వాత పింక్ డైమండ్ గురించి మాట్లాడారా.. ఆరోపణలు చేయడం చాలా ఈజీ.. తాను ఏనాడూ తప్పు చేయలేదన్నారు. అందుకే తిరుపతి నడివీధుల్లో నడుస్తున్నానని.. తప్పు చేసిన వ్యక్తి పరదాలు కట్టుకుని బయటకు వస్తున్నారన్నారు. పింక్ డైమండ్ గురించి విజయసాయిరెడ్డినే అడగాలన్నారు లోకేష్.
ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు లోకేష్. దానికి కారణం అధికారంలో ఉన్న నాయకుల ప్రవర్తన.. ఓ మహిళా మంత్రి నాకు చీరలు, గాజులు పెడతానని చెప్పిందన్నారు. మహిళల్ని ఆమె అవమానించిందని.. తనకు చాలా బాధ వేసిందన్నారు. ఆ చీర, గాజులు తనకు పంపు వాటిని అక్క చెల్లెమ్మలకు ఇచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళల్ని గౌరవించడం ఇంటి నుండే అలవాటు కావాలని.. మహిళల్ని గౌరవించడం ఎల్.కే.జీ నుంచి పిల్లలకు నేర్పించాలన్నారు. మహిళా సాధికారత ఇంటి నుండే ప్రారంభం కావాలని.. తన ఇంట్లో తల్లి, భార్య సంపాదిస్తే తాను, తండ్రి చంద్రబాబు ఖర్చు చేస్తామన్నారు. మహిళలకు ఉపాధి, సాధికారత దిశగా నడిపించే బాధ్యతను అవలంభించాలన్నారు. గతంలో మహిళల్ని సాధికారత దిశగా నడిపించామని.. అధికారంలోకి వచ్చాక మళ్లీ కొనసాగిస్తామన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు ఓ వేదిక ఇస్తామని.. ఇండస్ట్రీయల్ క్లస్టర్, కారిడార్‌లో మహిళలకు పరిశ్రమలు పెట్టేలా అవకాశాలు గతంలో ఇచ్చామని.. భవిష్యత్తులోనూ ఇస్తామన్నారు.
టీడీపీ ప్రభుత్వం రాకముందు ఉన్న ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తాము కొనసాగించామని. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ప్రతి వ్యక్తిమీద, చివరకు పుట్టబోయే బిడ్డపై కూడా రూ.2.5లక్షల అప్పును చేశారని ఆరోపించారు. ఏపీకి సంక్షేమం అవసరం.. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమన్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి.. ఇది కొనసాగితేనే యువత భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందన్నారు.