ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. సుదీర్ఘంగా సాగిన తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలికారు. పొలిటికల్ ఇన్నింగ్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు సోనియా గాంధీ. తన రాజకీయ ప్రస్థానాన్ని భారత్ జోడో యాత్రతో ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తోన్న ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించిన సోనియా గాంధీ ఈ పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటనను వెల్లడించారు. "భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్. భారత్ జోడో యాత్రతో తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసింది. దేశానికి కాంగ్రెస్‌కు 2024 ఎన్నికలు పరీక్షలాంటివి. యూపీఏ పాలన నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది." అని కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ.
3 రోజుల పాటు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి సోనియా గాంధీ ప్రసంగించారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారన్న విషయం భారత్ జోడో యాత్రతో తెలిసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో వచ్చే ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని శ్రేణులకు సోనియా సూచించారు.
మరోవైపు.. ప్లీనరీ సమావేశంలో బీజేపీ మీద సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ సర్కార్.. దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. అన్ని సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని.. అదానీ వంటి కంపెనీలను పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు. తాను మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్న సోనియా గాంధీ.. ప్రస్తుతం కూడా అలాంటి పరిణామాలే ఉన్నాయని తెలిపారు. పార్టీ సందేశాన్ని దేశ ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.