టీడీపీ ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ దేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని స్పష్టంచేశారు. జూ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ నారా లోకేష్ ఆహ్వానించడంపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. తెలుగు దేశం పార్టీని పెట్టింది జూ. ఎన్టీఆర్ తాత ఎన్టీ రామారావు అని అన్నారు. అంతేగాని, లోకేష్ తాత ఖర్జూర నాయుడు కాదని సెటైర్లు వేశారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఎన్టీఆర్‌ను కలిసి పని చేద్దామని లోకేష్ పిలవడం హాస్యాస్పదంగా ఉందని వల్లభనేని వంశీ అన్నారు. టీడీపీ ఎన్టీఆర్ పార్టీ అని.. ఎప్పటికైనా అది ఎన్టీఆర్ పార్టీ అవుతుందని జోస్యం చెప్పారు. 2009లో లోకేష్‌కు బొడ్డు ఊడనప్పుడు, టీడీపీలో చేరకుండా గాలికి తిరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ గెలుపు కోసం పని చేశారని తెలిపారు. ఎన్టీఆర్‌కు ఎవరి దయ, ప్రాపకం అవసరం లేదన్నారు. టీడీపీ జూ. ఎన్టీఆర్ తాత పార్టీ అని.. దాన్ని ఆయన చూసుకోగలరని వ్యాఖ్యానించారు.
ఇక, గన్నవరంలో ఉద్రిక్తత, చంద్రబాబు టూర్‌లో చేసిన కామెంట్లపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనదైన శైలిలో అటాక్‌కు దిగారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగొచ్చని.. చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమాలో లాగా అస్సాంకి వెళ్లొచ్చని, నడుముకు రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి ఎగరొచ్చు, కావాలంటే గోదావరిలోకి కూడా దూకొచ్చని ఎద్దేవా చేశారు. కానీ, సెక్షన్ 144, 31 అమలులో ఉన్నప్పుడు పోలీసులు నియంత్రిస్తారని పేర్కొన్నారు. తన హయాంలో ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణ మాదిగలను రాష్ట్రంలో తిరగకుండా చంద్రబాబు నియంత్రించారు కదా అని ప్రశ్నించారు. మరి దీన్ని ఏమంటారని నిలదీశారు. ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వల్లే ఒక రోజు చంద్రబాబు గన్నవరం వెళ్లకుండా పోలీసులు నియంత్రించారని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అన్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూసి చంద్రబాబు కూడా అవే డైలాగులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తనను పశువుల డాక్టర్ అంటున్నారని.. తిరుపతిలో చంద్రబాబు శిశువుల డాక్టర్‌ను మోసం చేసిన కథ చెప్పమని కొందరు అడుగుతున్నారని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. ఆ కథ చెబితే మళ్ళీ భోరున ఏడుస్తారేమో అని ఎద్దేవా చేశారు. ఎక్కువగా మాట్లాడితే తాను కూడా శిశువుల డాక్టర్ కథ చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.