ప్రేమ పేరుతో ఉన్మాదుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే తన పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందని ఆగ్రహంతో రగిలిపోయిన ఓ ప్రబుద్ధుడు.. మైనర్ బాలికపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అత్యంత అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ (Raipur)లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... రాయ్‌పూర్‌లోని గుధియారీ ప్రాంతంలో ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ (47) అనే వ్యక్తి ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ దుకాణంలో కొన్నాళ్లుగా బాధిత బాలిక (16) పని చేస్తోంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై మనోజ్ ఒత్తిడి చేయగా.. అందుకు బాలిక, ఆమె తల్లి నిరాకరించారు. వెంటనే బాలిక అతడి దుకాణంలో పని మానేసింది. దీంతో బాలికపై కోపం పెంచుకున్న నిందితుడు.. అదును చూసి దాడికి పాల్పడ్డాడు. ఆమెను ఆయుధంతో గాయపరిచి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు.
ఈ దృశ్యాన్ని కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఒంటిపై పలు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె కోలుకున్న తర్వాత వాంగ్మూలం నమోదు చేస్తామని తెలిపారు.
మరోవైపు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు. నిందితుడి దుకాణంలోనే బాలిక పనిచేస్తోందని అన్నారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు తక్షణమే స్పందించి, నిందితుడ్ని అరెస్ట్ చేశారన్నారు.