పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. విశాఖపట్నం - విజయనగరం - శ్రీకాకుళం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు మరియు రాష్ట్ర సర్వే కమీషనర్ సిద్ధార్థ్ జైన్ సోమ వారం విశాఖపట్నం నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని అన్నారు. పోలింగ్ సిబ్బందిని గుర్తించామని, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులను నియమించి ఒక దశ శిక్షణ పూర్తి చేశామని చెప్పారు. ప్రతి విభాగానికి ఒక నోడల్ అధికారిని నియమించామని ఆయన అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు బృందాలను నియమించామని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ బాక్స్ లను ఇప్పటికే ఒకసారి పరిశీలన జరిగిందని ఆయన పేర్కొన్నారు.
12వ తేదిన ఎన్నికల సామగ్రి పంపిణీ, ఎన్నికల అనంతరం సామగ్రి స్వీకరణ రిసెప్షన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలు సున్నితమైన కేంద్రాలుగా పరిగణిస్తున్నామన్నారు. ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరుగుటకు అందరూ చక్కటి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి పట్టభద్రుడు ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. అవసరమగు పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఆయన సూచించారు. 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, బ్యాలెట్ పత్రం తయారీ, రవాణా, ఓటింగ్ తదితర అంశాలపై జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. పొలింగకు 48 గంటల ముందు నుండి మద్యం విక్రయాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ. దిలీప్ కిరణ్, , ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఐదు రూట్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నాలుగు స్టాటిక్ బృందాలు నియమించామని అన్నారు.