ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ విభాగం నేతలు, కార్యకర్తలు సోమవారం తిరుపతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం తిరుపతికి వచ్చిన సోము వీర్రాజును వారు అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ముగించుకుని కారులో బయలుదేరిన వీర్రాజును ఆప్ కార్యకర్తలు అడ్డుకుని ‘బీజేపీ డౌన్‌డౌన్’ అని నినాదాలు చేశారు. ఆప్ నేతలను గమనించిన బీజేపీ శ్రేణులు.. ఆందోళనకారులను పక్కకు లాగిపడేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆప్ కార్యకర్తలు సోము కారుకు అడ్డంగా పడుకునే ప్రయత్నం చేయడంతో బీజేపీ శ్రేణులు వారిపై దాడికి దిగి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనలో పాల్గొన్న ఆప్ జిల్లా అధ్యక్షుడు నగేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటాచలపతి మాట్లాడుతూ.. సిసోడియాపై పెట్టిన కేసులను ఉపసంహరించి, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీర్రాజుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించామని, ఆయన తీసుకోలేదని చెప్పారు.