ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో రూ.900 కోట్ల అప్పు తీసుకురానున్నదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తెలిపారు. దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన అప్పు రూ.84,400 కోట్లుకు చేరుతుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘దేశ చరిత్రలో ఇంత వరకు ఏ రాష్ట్రం ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత అప్పు చేయలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పటి వరకు ఉన్న అప్పు రూ.10,20,373 కోట్లు. ఇందులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మూడు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పుతో పాటు పెట్టిన బకాయిలు కలిపి రూ.6,57,998 కోట్లు. మన దేశ చరిత్రలో ఇంత మొత్తంలో, ఇంత తక్కువ సమయంలో అప్పు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం మన ఏపీ. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి మీద ఉన్న అప్పు దాదాపు రూ.2 లక్షలు. ఇంత అప్పు చేసినా సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. రాష్ట్రం ఆర్థికంగా చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది’’ అని జీవీ వివరించారు.