పలుమలుపులు తిరుగుతూ మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు చివరికి కీలక దశకు చేరుకుంది. ఈ సమయంలో.. ఎవరూ ఊహించని అంశంపై తెరపైకి వచ్చింది. తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా.. సునీల్ యాదవ్ న్యాయవాది టి.నయన్‌కుమార్‌రెడ్డి.. కీలక అంశాలను ప్రస్తావించారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలు లేవని.. ఓ ముస్లిం యువతి కారణంగా హత్య జరిగిందని ఆయన వాదించారు. దీంతో వై.ఎస్.వివేకానందరెడ్డి కేసు మరో మలుపు తిరిగింది.
'వివేకానంద రెడ్డి హత్య రాజకీయ కారణాలతో జరగలేదు. ఓ ముస్లిం యువతి వల్ల జరిగింది. అది వలపు వల. లవ్ జిహాద్. వివేకా హత్య తర్వాత ఆ ఇంట్లో తన భార్యకు చాలా కాగితాలు లభించాయని వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలంలో చెప్పారు. షేక్ షమీకి రూ.8 కోట్లు ఇవ్వాలని వాటిలో వివేకా నోట్ చేశారని.. షేక్ షమీకి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అఫ్జల్‌ఖాన్‌కు రూ.12.5 కోట్లు ఇవ్వాలని.. వాటిలో రూ.8 కోట్లు షమీకి ఇవ్వాలని ఉంది. షబానా, రజియా, సుల్తానాతోనూ ఆయనకు సంబంధం ఉందన్నారు. షేక్ షమీ సోదరిని.. సుధీర్‌రెడ్డికి ఇచ్చి వివేకా పెళ్లి జరిపించారు. ఇదో లవ్ జిహాద్' అని సునీల్ యాదవ్ లాయర్ నయన్‌కుమార్ రెడ్డి వాదించారు.
'ఇలాంటి హత్యలు సాధారణమేనని అప్పటి డీజీపీ ఠాకూర్ కూడా చెప్పారు. పిటిషనర్ సునీల్‌యాదవ్ విచారణకు సహకరించలేదనడం అవాస్తవం. 2021 ఆగస్టు 6 నుంచి 16 వరకు ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు. డీఎస్పీ కె.శ్రీనివాసరావు ఆయన్ను చిత్రహింసలు పెట్టారు. సీబీఐ 1,451 మంది సాక్షులున్నారని చెప్పినా ఒక్క వాంగ్మూలమూ సమర్పించలేదు. వారిలో ఏ ఒక్కరూ పిటిషనర్‌కు వ్యతిరేకంగా చెప్పినట్టు వెల్లడించలేదు. హత్య ఘటనలో భాగస్వామి అయిన దస్తగిరి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుంది. సీబీఐ చేతిలో దస్తగిరి ట్రంప్‌కార్డ్' అని నయన్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
'వివేకా చనిపోవడం వల్ల సునీల్ యాదవ్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయనకు ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం లేదు. కేసు తెలంగాణలో ఉన్నందున బెయిల్ ఇచ్చినా ఆయన ఏపీకి వెళ్లరు. షరతులతో బెయిల్ మంజూరు చేయాలి. ఆయన విచారణకు సహకరిస్తారు' అని టి.నయన్‌కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు.