అమరావతి ప్రాంత మాష్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో అవకతవకల కేసు మాజీ మంత్రి నారాయణను వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసుపై సీఐడీ స్పీడ్ పెంచింది. తాజాగా.. సీఆర్పీఎఫ్ సెక్షన్ 41ఏ కింద మాజీ మంత్రి పి. నారాయణ, నారాయణ భార్య పి.రమాదేవి, పి. ప్రమీల, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఎం.డీ. అంజనీ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా తయారు చేసిన అలైన్ మెంట్లో.. మార్పులు చేసి లబ్ది పొందారన్న ఆరోపణల్ని మాజీ మంత్రి నారాయణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో.. నారాయణను గతంలో పలుమార్లు విచారించిన సీఐడీ.. ఈసారి ఆయనతో పాటు భార్య రమాదేవిని కూడా ఈ కేసులో విచారణకు రావాలని సెక్షన్ 41ఎ నోటీసులు పంపింది. వీరిద్దరితో పాటు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్‌కు, నారాయణ సంస్ధల ఉద్యోగి ప్రమీలకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరందరినీ మార్చి 6వ తేదీన గుంటూరులో విచారణకు రావాలని కోరింది.
ఇదే వ్యవహారంలో.. సాక్షులుగా విచారణకు హాజరు కావాలని మరో నలుగురికి ఏపీ సీఐడీ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు పంపింది. సాక్షులుగా విచారణకు రావాలని కోరిన వారిలో.. మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు సింధూర, షరిణితో పాటు అల్లుడు పునీత్, నారాయణ సంస్ధల ఉద్యోగి వరుణ్ కుమార్ ఉన్నారు. వీరందరినీ మార్చి 7, 8 తేదీల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ కోరింది. అయితే.. నోటీసులు పొందిన వారిలో.. ఎక్కువమంది నారాయణ కుటుంబ సభ్యులే ఉండటం చర్చనీయాంశంగా మారింది.