ఏపీలో తాజాగా పొత్తులపై ప్రధానంగా చర్చసాగుతోంది. ఎవరు ఎటు చివరి నిమిషంలో మొగ్గు చూపుతారు అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలావుంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విసిరిన సవాల్‌పై.. టీడీపీ, జనసేన పార్టీలు రియాక్ట్ అయ్యాయి. టీడీపీ పొత్తులపై డైరెక్ట్ క్లారిటీ ఇవ్వకపోయినా.. జనసేన మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమ పొత్తు బీజేపీతోనే అని కుండబద్ధలు కొట్టింది. దీంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం అందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో..సవాల్ విసిరితే.. తాము సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
'జగన్ అనే వ్యక్తి.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం.. గెలుస్తాం అని దమ్ముగా చెబుతున్నారు. ఇదే మాట చంద్రబాబు గానీ.. పవన్ కళ్యాణ్ గానీ చెప్పగలరా. జనసేన ఎలాగూ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు అని అర్థం అయ్యింది. కనీసం.. టీడీపీతో కలిసి పోటీ చేస్తారా.. బీజేపీతో కలిసి పోటీ చేస్తారా అనేది అయినా ప్రజలకు చెప్పాలి. రైతుల విషయంలో.. పవన కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారు. ఎవరు చనిపోతే.. వాళ్లకు లక్ష రూపాయల డబ్బులు ఇస్తామని.. వాళ్లతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. జాతీయ స్థాయిలో జీడీపీ 6 శాతం ఉంటే.. ఏపీలో 11 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని జగన్ పనిచేస్తున్నారు. కానీ.. టీడీపీ, జనసేన రాజకీయం చేస్తోంది. పొత్తులపై ఇప్పుడు బీజేపీతో అంటున్నారు. జనసేన ఇప్పుడు చెప్పిన మాట తప్పితే.. ప్రజలకు క్షమాపణ చెబుతారా. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.
'ఒంటరిగా పోటీ చేస్తారా అని అడగటానికి అసలు ముఖ్యమంత్రి ఎవరు. దమ్ము, ధైర్యం ఎవరికి కావాలి. దేనికి కావాలి. విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడటం ఏంటి. 28 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్‌లో వెళ్లారు. ఆయన అంత దూరం కూడా రోడ్డుపై వెళ్లలేరా. గతంలో అమరావతి, సీపీఎస్ వంటి అంశాల్లో జగన్ మాట తప్పారు. సీఎం జగన్.. కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించడం లేదు. పవన్ పేరెత్తడానికి కూడా భయపడుతున్నారు. ఎవరో ఒక్కరు తొడ కొడితే.. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు అడిగితే.. చెప్తాం. 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తాం.. బీజేపీతో కలిసి పోటీ చేస్తాం. మీకు దిక్కున్నచోట చెప్పుకొండి' అని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో.. ఏపీ రాజకీయం మరో మలుపు తిరిగింది.