పతొమ్మిదేళ్లకు గజినీ అయ్యాడు ఓ యువకుడు. వృద్ధాప్యంలో మతిమరుపు సర్వసాధారణం. వయసు పైబడుతున్న కొద్దీ మనిషికి జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కన్పించే ఈ లక్షణాన్ని అల్జీమర్స్‌గా పిలుస్తారు. కానీ, చైనాకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడిలో ఈ లక్షణాలు గుర్తించడం గమనార్హం. ఇంత చిన్న వయసులో ఓ వ్యక్తి అల్జీమర్స్ బారిన పడటం ప్రపంచంలో ఇదే మొదటిసారని బీజింగ్‌లోని గ్జువాన్‌వు హాస్పిటల్ ఆఫ్ క్యాపిటల్ మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఆ యువకుడిలో 17ఏళ్ల వయసులోనే మతిమరుపు లక్షణాలు కన్పించాయి.
గత రెండేళ్లలో అతడి జ్ఞాపకశక్తి చాలా వేగంగా క్షీణించిందని పరిశోధకులు పేర్కొన్నారు. జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మెదడులోని హిప్పోకాంపస్ క్షీణించడం వంటి అల్జీమర్స్ ప్రధాన లక్షణాలను ఆ యువకుడిలో గుర్తించినట్లు వివరించారు. దీని వల్ల ప్రస్తుతం అతడు తనకు సంబంధించిన అన్ని విషయాలను మర్చిపోతున్నాడని, కనీసం తన వస్తువులు ఎక్కడ పెట్టాడో కూడా గుర్తులేనంత పరిస్థితికి చేరుకున్నాడని చెప్పారు. మతిమరుపు కారణంగా చదివింది గుర్తుపెట్టుకోపోవడం, వేగంగా స్పందించపోవడం వల్ల తన హైస్కూల్ చదువును ఆపేయాల్సి వచ్చిందని తెలిపారు.
30ఏళ్లలోపు వారు జన్యుమార్పుల కారణంగా అల్జీమర్స్ వ్యాధికి గురవుతుంటారు. గతంలో ఓ 21 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా.. జన్యుపరమైన మార్పుల కారణంగానే అలా జరిగిందని గుర్తించారు. అయితే, ఈ యువకుడిలో అలాంటి కారణాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రులను కూడా పరీక్షించామని, ఎలాంటి జన్యుపరివర్తన లేకుండా ఆ యువకుడికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అయితే, దీనికి గల కారణాలను మాత్రం ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు.
ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో జనవరి 31న ప్రచురించారు. ‘‘ఇంత చిన్నవయసులో అల్జీమర్స్ రావడానికి కారణాలపైదృష్టి పెట్టాలని అధ్యయనం ప్రతిపాదించింది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న యువకుల రహస్యాలను అన్వేషించడం భవిష్యత్తులో అత్యంత సవాలుగా ఉన్న శాస్త్రీయ ప్రశ్నలలో ఒకటిగా మారవచ్చు’’ అని ఆథర్ వ్యాఖ్యానించారు. మతిమరుపు లక్షణాలను గుర్తించడానికి వినియోగించే ఆడిటరీ వెర్బల్ లెర్నింగ్ టెస్ట్ ఫలితాలు అసాధారణంగా ఉన్నాయని పేర్కొన్నారు.
‘ఈ అరుదైన కేసు కూడా డెమెన్షియా స్వభావాన్ని పరిగణలోకి తీసుకునేలా పరిశోధకులను ప్రేరేపిస్తోంది... ఇది డెమెన్షియా విజాతి స్వభావాన్ని దృష్టిలో ఉంచుతుంది.. ఏ వయస్సు వ్యక్తులైనా దీని ప్రభావానికి గురికావచ్చు.. 19 ఏళ్ల యువకుడిలో అల్జీమర్స్‌ను గుర్తించడాన్ని బట్టి మధ్య వయసులో ప్రారంభమవుతుందనే ప్రస్తుత భావన నుంచి యుక్తవయస్సులో మొదలవుతుందనే ఆలోచనను రేకెత్తిస్తుంది’’ అని జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ ఎడిటర్-ఇన్-చీఫ్ జార్జ్ పెర్రీ అన్నారు.