యంత్రాలు మనుషులతో పోటీ పడలేవు అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే కృత్రిమ మేధా సాంకేతికతో పని చేసే ఛాట్‌జీపీటీ చాట్‌బాట్ ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అమెరికాకు చెందిన ఓపెన్ఏఐ అనే సంస్థ దీనిని అభివృద్ది చేయగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది యూజర్లను సంపాదించుకుంది. దీనికి పోటీగా మైక్రోసాఫ్ట్ బింగ్, గూగుల్ బార్డ్ ఏఐ చాట్‌బాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో మానవుల్లో ఆందోళన నెలకొంది. పని ప్రదేశాల్లో మనుషులను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌లు భర్తీ చేస్తాయనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి. ఏఐ టెక్నాలజీ అనేది మనుషులు మరింత క్రియేటివ్‌గా, ప్రొడక్టివ్‌గా ఆలోచించేందుకు ఒక సహాయ సాధనంగా ఉపయోగపడతాయన్నారు.
'ఏఐ టెక్నాలజీ జీవితాన్ని మరింత సౌకర్య వంతంగా మారుస్తుంది. అయితే, మనుషులు వారిని ఎప్పటికీ టెక్నాలజీ ఓవర్ టేక్ చేయనివ్వరు. మనుషులకు మెదడు అనే పవర్ ఉంది. దాంతో యంత్రాలు ఎప్పటికీ పోటీ పడలేవు. మనుషుల మైండ్ ఎప్పుడూ టెక్నాలజీకన్నా ఒక అడుగు ముందుగానే ఉంటుంది. మాస్టర్‌గా అవతరించేందుకు దాని ఆ సామర్థ్యం ఉంటుంది.' అని పేర్కొన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి. గతంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పుడు సైతం ప్రజలు ఇలాగే భయపడ్డారని కానీ, వారిని అవి అధిగమించలేకపోయాయని గుర్తు చేశారు. ఏఐ టెక్నాలజీ సాయం లభించిన తర్వాత కూడా మనుషులు సంతృప్తి చెందరని, అంతకు మించిన దాని కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.
మనుషులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందన్న విషయంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధికారి సైతం మాట్లాడారు. ఛాట్‌జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్ అవేవి ఏఐ కో వర్కర్‌ను క్రియేట్ చేస్తాయి తప్పా ఉద్యోగాలను భర్తీ చేయబోవని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. అలాంటి టూల్స్ ఉత్పాదకతను పెంచేందుకు ఉపయోగపడతాయని, కానీ కంపెనీల బిజినెస్ మోడల్స్‌ను మార్చే పరిస్థితి లేదన్నారు.
మరోవైపు.. వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్‌లైటింగ్ వంటి విషయాలపై ఇటీవలే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. రిమోట్ వర్క్‌ను తాను ఏ మాత్రం సమర్థించని నొక్కి చెప్పారు. మూన్ లైటింగ్ లేదా ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయడం అనేదానిని తాను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. నిజాయతీతో పని చేయాల్సిన వాతావరణాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. మూన్ లైటింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని దేశంలోని యువతకు సూచించారు. ఇంటి నుంచే పని చేస్తా, మూన్ లైటింగ్ చేస్తా, మూడు రోజులే ఆఫీసుకు వస్తా వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.