సత్తెనపల్లి: ముఖ ఆధారిత హాజరుకు వివరాలు నమోదు చేయించుకోలేదనే చిన్న కారణంతో కొమెరపూడి వీఆర్‌ఏ కొరబండి శ్రీనివాసరావుపై భౌతిక దాడి చేసిన సత్తెనపల్లి తహసీల్దార్ నగేష్‌ను వెంటనే కలెక్టర్ సస్పెండ్ చేసి, బదిలీ చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఏపీ జేఏసీ ఉమ్మడి జిల్లా ఛైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక తాలుకా ఎన్జీవోస్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, బటన్లు నొక్కడానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వాధినేత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు ప్రతినెలా సక్రమంగా వేతనాలు అందజేయడంపై దృష్టి సారించట్లేదన్నారు. అధికారంలోకి రాగానే వారంలో రద్దు చేస్తామన్న సీపీఎస్ ఊసే నాలుగేళ్లయినా లేదన్నారు.
ఉద్యోగులు తాము దాచుకున్న డబ్బుల్ని ప్రభుత్వం నుంచి తిరిగి తీసుకోవాలంటే సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన దారుణ పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎస్. సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా ఇబ్బందిపడుతున్నారని. అసహనానికి గురవుతున్నట్లు చెప్పారు. ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఇచ్చిన హామీల్ని ముఖ్యమంత్రి నెరవేర్చలేదన్నారు. వీఆర్‌ఏపై దాడి చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వివిధ సంఘాల నేతలు ఎస్‌ఎం సుభాని, చిలుకా అగస్టస్ బాబు, పెండెం మణిరావు అన్నారు. ఏపీ జేఏసీ నేతలు శ్రీనివాసరెడ్డి, నరసింహరావు, సలీం, అంబేడ్కర్, రవిచంద్రకుమార్, ఇబ్రహీం, చంద్రకాంతం తదితరులు పాల్గొన్నారు.