ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామమని ఇది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడిందని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల మూడు, నాలుగు తేదీల్లో విశాఖపట్నంలో జరుగు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణఅధ్యాయం కానుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖపట్నంలో మూడు సీఐఐ సదస్సులు జరిగాయని వందలాది ఎంఓయూలు కుదుర్చుకున్నప్పటికీ ఏ ఒక్కరు ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదని ఆ మూడు సదస్సులు షూటు, బూట్లకే పరిమితం అయిపోయాయని ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖపట్నం నిర్వహిస్తున్నారని సుమారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా పేరుందనుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్థూల జాతీయోత్పత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. మత్స్యకారులకు పింఛన్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదని ఆయన వాల్లే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని మళ్లీ ఆయనకు అఖండ మెజార్టీ చేకూర్చి పెట్టాలని గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు, కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.