మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలులోని అతిథిగృహానికి విచారణకు రావాలని పేర్కొంది. సీబీఐ అధికారుల బృందం బుధవారం పులివెందులలోని భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఈ నోటీసులు అందజేసింది. వివేకా హత్య జరిగిన రోజు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడం, హత్య వెనుక భారీ కుట్రను ఛేదించేందుకు ఆయన్ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. గత నెల 23న విచారణకు రావాలని సీబీఐ అధికారులు తొలుత నోటీసులిచ్చారు. అయితే ఆ రోజు పనులు ఉన్న కారణంగా మరో రోజు వస్తానని భాస్కర్‌రెడ్డి సమాధానమిచ్చారు. గత నెల 24న హైదరాబాద్‌లో ఆయన కుమారుడు అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారించింది. ఆ మర్నాడు భాస్కర్‌రెడ్డిని రమ్మందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికితోడు సీబీఐ అధికారులు 25వ తేదీన కడప వెళ్లడంతో ఈ కథనాలకు బలం చేకూరింది. కానీ వారు ఆయన్ను పిలువలేదు. ఇప్పుడు అందజేసిన నోటీసులో 12న విచారణకు రావాలని ఆదేశించారు. అవినాశ్‌రెడ్డిని సీబీఐ బృందం హైదరాబాద్‌లో రెండు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారమే తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో భాస్కర్ రెడ్డి పాత్ర గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.