వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా సీఎం జగన్ పిచ్చివేషాలు వేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఓ శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. వైఎస్ ఉన్నప్పుడే జగన్ పిచ్చివేషాలు వేసేవారని, వాటిని ఆయన బయటకు రాకుండా కాపాడారని చెప్పారు. ఏపీ ప్రజలను చూస్తుంటే జాలి పడాలో, కోపం తెచ్చుకోవాలో, ఆక్రోశించాలో అర్థం కావడం లేదన్నారు. బంగారంలాంటి రాష్ట్రం పతనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను జగన్ లెక్క చేయడం లేదని.. కోర్టు ఆయనపై ఎందుకు సుమోటోగా చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు.