అందరికీ అన్నం పెట్టే రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి నగరంలోని స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో బుధవారం కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో బాలికా విద్యను ప్రోత్సహిస్తూ చదువులో ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో విద్యాప్రమాణాలు పెరిగాయని, దిగ్గజ కంపెనీల సీఈవోలుగా మన భారదీయులే ఉండడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. త్వరలో విశాఖ గొప్ప ఐటీ నగరంగా రూపుదిద్దుకోనుందని, తద్వారా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయ న్నారు. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ జోనల్ మేనేజర్ కీర్తి కృష్ణ మాట్లాడుతూ.. తమ సంస్థ రైతులకు గత 50 ఏళ్లుగా అనేక సేవలందిస్తోందన్నారు. ఉద్దానంలో మూడు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. మార్క్‌ఫెడ్ మేనేజర్ రోజారమణి, కిషోర్ వర్మ, చిలుకు కృష్ణారావు పాల్గొన్నారు.