చమురు సంస్థలు గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. సిలిండర్ ధరలను మళ్లీ పెంచేశాయి. గృహ అవసరాలకు వినియోగించే రాయితీ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350 చొప్పున పెంచడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నాయి. ఇండియన్, భారత్, హెచ్‌పీ తదితర ఇంధన సంస్థలకు సంబంధించి 45 వరకు ఏజెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,081.50 ఉండగా, బుధవారం నుంచి రూ.1,131.50కు పెరిగింది. ఈ నేపథ్యంలో వినియోగదారులపై నెలకు సుమారు రూ.6కోట్ల మేర అదనపు భారం పడనుంది. వాణిజ్య సిలిండరు విషయానికొస్తే రూ.1,817గా ఉన్న ధర రూ.2168.50 చేరింది. ఒకేసారి రూ.350 వరకూ పెరగడంతో చిన్న వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఏదైనా ధర పెరిగితే.. పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతుంది. ఇప్పటికే సబ్సిడీ లేకపోగా.. ఒకేసారి పెద్ద మొత్తంలో సిలిండర్ ధర పెంచేయడాన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 2015లో వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.150 వరకు సబ్సిడీ వచ్చేది. కేంద్ర ప్రభుత్వం క్రమంగా సబ్సిడీ ఎత్తివేయడంతో గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి గ్యాస్ సిలిండర్ ధరలను నియంత్రించాలని జిల్లావాసులు కోరుతున్నారు.