తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులతో తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ జాబ్ కార్డ్ ఉన్న ప్రతి వ్యక్తికి పని కల్పించే విధంగా సిబ్బంది పనిచేయాలని ఆమె సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అలసత్వం వహిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. పని ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ ఏడాది కొత్త పనులు కల్పించడంతోపాటు ప్రతి వ్యక్తికి పని కల్పించే విధంగా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద అనేక అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉన్నా. గతంలో వాటిని తక్కువగానే గుర్తించేవారన్నారు.
ఏవో కొన్ని రకాల పనులే చేపట్టేవారని. ఇప్పుడా విధానం మారిందన్నారు. తక్షణ ప్రజా ఉపయోగ పనులను గుర్తించడమే గాకుండా వెనువెంటనే చేపట్టేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మార్గం సుగమమైందన్నారు. ప్రజలకు వారి గడప వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవస్థకు అంకురార్పణ చేశారన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాడికొండ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో 7, 30, 991 పని దినాలు కల్పించామని 89 కుటుంబాలకు పూర్తిగా వంద రోజుల పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి 8, 53, 814 పని దినాలు కల్పించనున్నట్టు తెలిపారు.