గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాల విషయంలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్‌రావు తెలిపారు. గుంటూరు నగరంలోని కృషి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు రూ. వేల కోట్లను ప్రభుత్వం అనధికారికంగా వాడుకుంటుందని మండిపడ్డారు. ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు రూ. 12 వేల కోట్లు బకాయి పడిందన్నారు. తమ సంఘం ముక్కుసూటిగా అడుగుతుందని, ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, ప్రయోజనాలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అందుకు సమాధానం చెప్పకుండా సంఘాలపై కత్తి పెడుతుందన్నారు. తమ సంఘం నుంచి ఇచ్చిన 113 డిమాండ్లపై సంఘాలను పిలిచి మాట్లాడి పరిష్కరించాలని, లేకపోతే ఏప్రిల్ నుంచి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయమనే కోరుతున్నామన్నారు.
ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించిన అడ్వాన్సులు, పెన్షనరీ ఛార్జీలు తదితర వివరాలను సీఎఫ్‌ఎంఎస్ కార్యాలయంను ఆర్టీఐ ద్వారా కోరితే. వారు తమకు సంబంధం లేదన్నారని, రాష్ట్ర ఖజానా శాఖను కోరితే. వారు తమ వద్ద సమాచారం లేదని సమాధానం ఇచ్చారన్నారు. ఇలా. అనేక ఇబ్బందులున్నా తాము వాటిని దాచి ప్రభుత్వం కోసం పని చేస్తున్నామన్నారు. మరికొద్ది నెలల్లో 12వ పీఆర్సీ రావాల్సి ఉందని, కానీ ఇంత వరకు 11వ పీఆర్సీకి సంబంధించిన ఉత్తర్వులే రాలేదన్నారు. ఒకటో తేేదీనే జీతం, జీత భత్యాలు ఇవ్వాలని, అందుకు చట్టం చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తే. తమ సంఘం గుర్తింపు రద్దు చేయాలని కొన్ని సంఘాలు ప్రయత్నం చేశాయన్నారు. ఉద్యోగ సంఘాల సమావేశానికి తమను ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం సొంత నిర్ణయాలతో ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందన్నారు. ఎమ్మెల్సీ నామినేషన్‌లో పాల్గొన్నారని మోడల్ కోడ్ అని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజుకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఓ సంఘ నాయకుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని బహిరంగంగానే పిలుపునిచ్చారని, మరి ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వంత పాడితే ఒకలా. ముక్కుసూటిగా వెళ్తే మరోలా వ్యవహరిస్తారా అని నిలదీశారు. జగన్‌మోహన్‌రెడ్డి నామం జపించినందుకు గతంలో తాను రెండుసార్లు సస్పెండయ్యాయని గుర్తు చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఉద్యోగుల భద్రతను కాపాడుకోవడానికి మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. బయోమెట్రిక్ హాజరు అని గత ప్రభుత్వంలో రూ. వేల కోట్లుతో యంత్రాలు కొన్నారని, ఇప్పుడు ముఖ ఆధారిత హాజరు అంటున్నారన్నారు. ఉద్యోగి రోజుకు మూడుసార్లు హాజరు వేయాల్సిన పరిస్థితి ఏమిటి? ఈ విధానం ఎక్కడుందని ప్రశ్నించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. విజయకుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్‌బాషా, సంఘ గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.