పురపాలక పాఠశాలలు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చినా పిల్లలకు మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఏటా పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నిర్వహణకు 45 రోజుల ముందు నుంచి పౌష్టికాహారం అందించి పరీక్షలకు వారిని మెరుగ్గా సన్నద్ధం చేయటం గత కొన్నాళ్ల నుంచి జరుగుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ‘పది’ చదివే పిల్లలకు ఫిబ్రవరి 15 నుంచి జడ్పీ ఆర్థిక సహకారంతో పౌష్టికాహారం పంపిణీ చేసే కార్యక్రమం మొదలైంది. కానీ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులను పరిగణనలోకి తీసుకోకుండా చిన్నచూపు చూడటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా చూస్తే మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పది చదివే విద్యార్థులు 1500 మందికి మించి ఉండరని విద్యాశాఖవర్గాల సమాచారం. అత్యధికంగా గుంటూరులో 16 మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో సుమారు 900 మంది విద్యార్థులున్నారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట పట్టణాల్లో మిగిలిన విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చినా ఇంకా మున్సిపల్ పాఠశాలలంటూ వ్యత్యాసం చూపటం ఏమిటి? ఈ పిల్లలకు పౌష్టికాహారం ఎందుకు అందించరని వాటిల్లో పనిచేసే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.