ఉమ్మడి గుంటూరు జిల్లాలో నల్లరేగడి నేలల్లో ఉన్న రహదారులు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో నూతన సాంకేతి పరిజ్ఞానంతో అధికారులు వాటిని నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని రోడ్లను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించనున్నారు. ఇప్పటికే ఉన్న రోడ్లను అడుగు మేర తవ్వి అదే సామగ్రికి రసాయనాలు, సిమెంట్ కలిపి నిర్మాణం చేపడతారు. వీటి నిర్వహణ కూడా గుత్తేదారు ఐదేళ్లపాటు చూస్తారు. తారురోడ్డు నిర్మాణంతో పోల్చితే వీటికి వెచ్చించే నిధులు కొంత ఎక్కువగానే ఉన్నా పర్యావరణ పరంగా అనుకూలంగా ఉండటం, మన్నిక ఎక్కువరోజులు ఉండటంతో వీటిపై మొగ్గుచూపుతున్నారు. రోడ్ల నిర్మాణానికి కొత్తగా కంకర, మట్టి అవసరం లేదు. దీనివల్ల సహజవనరులు వినియోగం తగ్గి పర్యావరణంపై ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.