ట్రెండింగ్
Epaper    English    தமிழ்

​లోకేశ్ తో భేటీ అయిన బీసీ నేతలు, ముస్లింలు, యువత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 12:07 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ద్వారా ఆ‍యన పలు సామాజిక వర్గాల నేతలతో, ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయన పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ కొక్కువారి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తుడుంవారిపల్లిలో బీసీ నాయకులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కల్లూరు శివార్లలో భోజన విరామ సమయంలో యువతతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు.


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీ టిప్పర్ ఎదుట యువనేత లోకేశ్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే కదా నిన్ను పాపాల పెద్దిరెడ్డి అని ప్రజలు అనేది అంటూ విమర్శించారు. "పుంగనూరు నియోజకవర్గంలో రోడ్డుపై చిన్న గుంత పూడ్చాలన్నా, రోడ్డు వేయాలన్నా పెద్దిరెడ్డి సొంత సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్సే చేయాలంట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నియంత పెద్దిరెడ్డికి చెందిన ఈ లారీ" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.


టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ టు పీజీ విద్యార్థుల‌కు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో యువతీయువకులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చాక పోటీపరీక్షలను ఎదుర్కొనే విధంగా సిలబస్ ను మార్పుచేస్తామని వెల్లడించారు. 


"చిత్తూరుకు స్పోర్ట్స్ యూనివర్శిటీ తీసుకొస్తాం. క్రీడలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. ఉమ్మడి ఏపీలో పుల్లెల గోపీచంద్ కు భూమి కేటాయించి అకాడమీ పెట్టిస్తే మన దేశానికి ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చాయి. ఏపీని ఐటీ హబ్ గా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు అనేక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. మీ కోరిక మేరకు కల్లూరుకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీని తీసుకొస్తాం" అని వివరించారు.


టీడీపీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో మన రాష్ట్రం వాళ్లే అధికంగా ఉన్నారంటే చంద్రబాబు చలవేనని అన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని తెలిపారు. టీడీపీ పాలనలో అనేక ఒప్పందాలు జరిగాయని, 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చుంటే ఇప్పటికే 50 లక్షల ఉద్యోగాలు వచ్చేవని లోకేశ్ వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిశ్రమలు, పెట్టుబడులు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తాయని ధీమాగా చెప్పారు.


పుంగనూరు ఎమ్మెల్యే ఇక్కడి యువత భవిష్యత్తును నాశనం చేశారని, పెద్దిరెడ్డి మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినా వైద్య సదుపాయాలు తీసుకురాలేకపోయాడని విమర్శించారు. "మేం అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాకు మెడికల్ యూనివర్శిటీని తీసుకొస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం. రాజంపేట ఎంపీగా ఒక వ్యక్తిని మీరు రెండుసార్లు గెలిపించారు. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా? పెద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిపించారు. మీకు ఉపయోగం లేదు. పాపాలు చేసే వారిని, మోసాలు చేసేవారిని గెలిపించి, ఉపయోగపడేవారిని పక్కనబెడితే మీకు పరిశ్రమలు, ఉద్యోగాలు ఎలా వస్తాయి? 


ఈ పుంగనూరులో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ తప్ప, మరేదైనా డెయిరీ ఇక్కడ ఉందా? పల్ప్ కంపెనీ పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు పెట్టి రైతులను దోచుకుంటున్నాడు. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే టీడీపీ ని గెలిపించండి. మీకు నిజమైన అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. పెద్దిరెడ్డి కుటుంబం ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్నంతకాలం మీ పుంగనూరుకు ఏమీ రావు" అని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com