పదవులు లేకున్నా సలహాలు ఇస్తాను....నాకు ఏ పదవి వద్దు అని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇదిలావుంటే చాగంటి కోటేశ్వరరావు టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పారాయణం కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా ఈ నియామకం చేపట్టినట్టు తెలిపారు. అయితే, ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు విముఖత వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి తన ఊపిరి అని పేర్కొన్నారు. ఇటీవల చాగంటి సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.