రాష్ట్రంలోని 15 రంగాల్లో పెట్టుబడులు సాధించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పు తీర నగరం విశాఖలో ఏపీ ప్రభుత్వం రెండ్రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్-2023) ముగిసింది. సీఎం జగన్ ముగింపు ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయిందని, 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఓవరాల్ గా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు వివరించారు. పెట్టుబడులకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.
పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనలో ఆలస్యం చేయరాదని, ఏపీ ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాము చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నామని, పర్యావరణ హిత ఇంధన, శక్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడుతున్నామని, రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఏపీ ఇప్పుడు నూతన పారిశ్రామిక విధానాలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కొనసాగుతోందని సీఎం జగన్ అన్నారు.