చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రముఖ ప్రముఖ సినీ హాస్యనటుడు డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. శనివారం రాత్రి తాడేపల్లి పరిధి వడ్డేశ్వరం లోని కెఎల్ ఢీమ్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమ్యక్ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు.
కెఎల్ విశ్వవిద్యాలయంలో సమ్యక్ వేడుకలు ఘనంగా జరిగాయి. సాస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా సినీ నటుడు డాక్టర్ బ్రహ్మానందంను కెఎల్‌యు చైర్మన్ కోనేరు సత్యనారాయణ సాదరంగా ఆహ్వానించారు. కుంచనపల్లి పాతూరు రోడ్డు వద్దకు అభిమానులు పెద్ద సంఖ్యంలో చేరుకుని బ్రహ్మానందంకు ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలతో భారీ ఊరేగింపుతో విశ్వవిద్యాలయానికి తోడ్కోని వచ్చారు.
బ్రహ్మానందం రాకతో వడ్డేశ్వరం, కుంచనపల్లి పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ, తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని అన్నారు. సత్తెనపల్లి మండలం, ముప్పాళ్ల దగ్గర ఉన్న చాగంటివారిపాలెంలో తాను చిన్నతనం నుండి ఎన్నో ఇబ్బందులను అధిగమించినట్లు తెలిపారు. ఢిల్లీ వీధుల్లో తాను సైకిల్‌పైన వెళ్లానని ఆ రోజులను దాటుకుని లెజోమో కారులో కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు పేదరికాన్ని, ఇబ్బందులను లెక్కచేయకుండా ముందుకు వెళితే మీలో నుండే ఎందరో బ్రహ్మనందాలు, బీఆర్ అంబేద్కర్‌లు వస్తారంటూ విద్యార్ధులకు పలు సూచనలు చేశారు.
భారతదేశంలో 75 శాతం మంది చదువుకునే జ్ఞానం ఉండి ఆర్థికంగా వెనుకబాటుతనం కలిగిన వారు ఉన్నారని వారందరూ గట్టిగా ప్రయత్నం చేస్తే తమ చదువుకు పేదరికం అడ్డు కాదని స్పష్టం చేశారు. కెఎల్ విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ కోనేరు హవీష్ హీరోగా నటిస్తున్న ఎస్ బాస్ చిత్రంలో తాను ఎస్ బాస్‌గా నటిస్తున్నట్లు తెలిపారు. పేదరికాన్ని ద్వేషించవద్దన్నారు. పేదరికాన్ని ప్రేమించండి, ఆదరించండి అది మీకు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతుందంటూ బ్రహ్మానందం చేసిన ప్రసంగానికి విద్యార్ధులు కేరింతలు కొట్టారు. జై బ్రహ్మీ, జైజై బ్రహ్మీ అంటూ నినాదాలు చేస్తు బ్రహ్మానందానికి జేజేలు పలికారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్. జగన్నాథరావు, వైస్ చాన్సులర్ డాక్టర్ పార్ధసారధివర్మ, ప్రో విసి డాక్టర్ ఎన్. వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జగదీష్, అకడమిక్ డీన్ డాక్టర్ వేగే హరికిరణ్, విద్యార్ధి వ్యవహారాల డీన్ డాక్టర్ చప్పిడి హనుమంతరావు, స్కిల్ అభివృద్ది డీన్ డాక్టర్ ఎ. శ్రీనాధ్, డాక్టర్ టి. పవన్ కుమార్, డాక్టర్ ఎం. సుమన్, ఉద్యోగాల కల్పన డీన్ డాక్టర్ ఎన్. బి. కె. ప్రసాద్, పరిశోధనల అభివృద్ది డీన్ జయకుమార్ సింగ్, డీన్ పిఎన్. డి డాక్టర్ రాజేష్, అధ్యాపకుల వ్యవహారాల డీన్ శ్రీకాంత్, క్వాలిటీ డీన్ రామకృష్ణ, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం. కిషోర్‌బాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాస్, పరిశోధనల డైరెక్టర్ డాక్టర్ శరత్‌కుమార్, అన్ని విభాగాల ప్రిన్సిపల్స్, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.