ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనిశ్ సిసోడియా అరెస్ట్‌పై ప్రధానిని ప్రశ్నించిన విపక్షాలు,,,కేసీఆర్, పవార్, మమతా సంయుక్తంగా లేఖ

national |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 01:20 PM

ఆప్ నేత, ఢిల్లీ మంత్రి మనిశ్ సిపోడియా అరెస్ట్ పై బీజేపీయేతర పార్టీలు మండిపడ్డాయి. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశగా పయనిస్తోందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎనిమిది విపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఉమ్మడి లేఖను మోదీకి పంపించాయి. సిసోడియాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేకున్నా.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపించాయి. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నీ విపక్షాలను లక్ష్యం చేసుకొనే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తాయి.


‘‘ఢిల్లీ పాఠశాల విద్యలో మార్పులకు ఆద్యుడిగా మనీశ్ సిసోడియాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. దేశంలో రాజకీయ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనేందుకు ఆయన అరెస్టు ఓ ఉదాహరణ.. బీజేపీ పాలనలో భారత ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయిలో దాడికి గురవుతున్నాయో ప్రపంచం గుర్తిస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీలు 2014 తర్వాత చేసిన అరెస్టులు, సోదాలు.. విపక్షాల లక్ష్యంగానే సాగాయి.. 2014-15లో ప్రస్తుత అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేశాయి..


ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసు ఊసేలేదు.. నారదా స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్న బెంగాల్లో సువేందు అధికారి, ముకుల్ రాయ్, మహారాష్ట్రలో నారాయణ్ రాణె వంటి వారి విషయంలోనూ ఇదే జరిగింది.. మరోవైపు, ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షాల నేతలపై ఈడీ, సీబీఐ దాడులు ఉద్ధృతం కావడం స్పష్టంగా తెలుస్తోంది.. ఇవన్నీ రాజకీయ ప్రోద్బలంతోనే జరిగాయని స్పష్టమవుతోంది. దర్యాప్తు సంస్థలను మీ ప్రభుత్వం విపక్షాలను వేధించేందుకే ఉపయోగించుకుంటోంది’’


అలాగే, అదానీ- హిండెన్బర్గ్ వ్యవహారంతో పాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై కూడా ఈ లేఖలో ప్రస్తావించాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో పదే పదే గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారని, బీజేపీయేతర ప్రభుత్వాలున్న ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉద్దేశపూర్వకంగానే పాలనను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.


ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (టీఎంసీ), ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ (ఆప్), ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంతకాలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ లేఖపై సంతకం చేయకపోవడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై సోనియా, రాహుల్ గాంధీలు గతేడాది ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశపూర్వకంగా పక్కన బెట్టారా? లేక ఆ పార్టీయే దూరంగా ఉందా? అనేది తేలియాల్సి ఉంది.


‘భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశం అని మీరు అంగీకరిస్తారని మేం ఆశిస్తున్నాం.. ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర ఏజెన్సీల నిర్లక్ష్య దుర్వినియోగం మేము ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వానికి మారినట్లు సూచిస్తుంది’ అని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), సంజయ్ రౌత్ (శివసేన), అజమ్ ఖాన్ (ఎస్పీ), నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ)లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది’ అని ఆరోపించాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com