బెంగాల్ టైగర్ భయంతో కొన్ని నెలలుగా విజయనగరం జిల్లా ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారి భయమే నిజమైంది. రాయల్ బెంగాల్ టైగర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి పులి పంజాకు ఓ ఎద్దు బలైంది. దీంతో ప్రజలు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ టైగర్ రీ ఎంట్రీ ఇవ్వడంతో.. ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు.
పశువుల వేటకు కాస్త విరామం ప్రకటించిన పెద్దపులి.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామంలోని జీడి తోటలో ఓ ఎద్దుపై దాడి చేసి చంపేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయింది. పులి ఎటు నుంచి దాడి చేస్తుందోననే భయంతో.. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. దాదాపు పది గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
పులి దాడిలో ఎద్దు మృతి చెందడంతో.. రైతులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు.. అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పాదముద్రలు సేకరించారు. జాగ్రత్తగా ఉండాలని పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే.. పులి ఇన్ని రోజులుగా సంచరిస్తున్నా.. ఇన్ని పశువులను చంపుతున్నా.. ఇంకా ఎందుకు బంధించడం లేదని.. మెంటాడ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పులిని త్వరగా బంధించాలని డిమాండ్ చేస్తున్నారు.