గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఈనెల 15వ తేదీ తరువాత పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో మేలు చేస్తున్న వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటూ ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 45,90,086 మందికి వైద్య సేవలు అందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలు, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు సహా వివిధ కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.