వేసవి నేపథ్యంలో మంగళగిరి నగరంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి నేపథ్యంలో నగరంలో చేతి పంపులు మరమ్మతులు నిర్వహించడంతో పాటు తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. నగరపరిధిలోని ముఖ్య కూడళ్లలో వేసవి చలివేంద్రాలను ఏర్పాటు చేసి వాహనదారులు, బాటసారుల దాహార్తిని తీర్చాలన్నారు.
చినకాకాని ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద జరుగుతున్న గౌతమ్ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు ఈనెల నాటికి పూర్తి చేయాలన్నారు. మే నెల చివరి నాటికి చేనేత భవనం నిర్మాణం పూర్తి కానున్న నేపథ్యంలో తెనాలి రోడ్డు విస్తరణకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నగర పరిధిలో పెండింగ్ లో ఉన్న సిసి డ్రైన్లు, రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
నగర పరిధిలో కుక్కలు, పందులు ఆవులు సంచారాన్ని అరికట్టేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, అందుకు వాటి యజమానులు కూడా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కమిషనర్ యు. శారదాదేవి, విద్యుత్ ఎస్ఈ డాక్టర్ విజయ్ కుమార్, డిఈఈ అక్కల సత్యనారాయణ, నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి, ఏఈలు రమేష్, కిషోర్, ప్రవీణ్ , ఏసీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.