విజయనగరం వన్‌టౌన్ పోలీసులు, దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళ్ళితే... జిల్లాలో గుర్ల మండలం గరికివలసకు చెందిన కోరాడ సత్యం అనే వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో ల్యాప్‌ట్యాప్‌ను అమ్మకానికి పెట్టాడు. ఈ ప్రకటన చూసి ల్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేస్తానని విశాఖపట్నంలోని పెద్ద వాల్తేరుకు చెందిన కర్రి శివరామకృష్ణ చెప్పి ఈనెల 4న విజయనగరం ఆర్‌అండ్ బీ ప్రాంతానికి కోరాడ సత్యాన్ని పిలిచాడు. కోరాడ సత్యం లాప్‌టాప్ తీసుకుని ఆర్‌అండ్‌బీ ప్రాంతానికి చేరుకోగా నిందితుడు శివరామకృష్ణ సత్యంపై దాడి చేసి, లాప్‌ట్యాప్ తీసుకుని పరారయ్యాడు. దీనిపై వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో సత్యం ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సీఐ వెంకట రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అశోక్‌కుమార్, హెచ్‌సీ అచ్చిరాజు, పీసీలు శివశంకర్, శ్రీనివాసరావు, అజయ్‌కుమార్‌ల బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారణ చేపట్టగా నేరాలు అంగీకరించాడు. ఇదే తరహాలో హైదరాబాద్ సిటీ పరిధిలో సుమారు 18, విశాఖసిటీలో నాలుగు, పార్వతీపురంలో ఒకటి, విజయనగరం వన్‌టౌన్ పరిధిలో ఐదు నేరాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు, ఆరు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు అశోక్ కుమార్, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.