అమరావతి రాజధాని భూముల విక్రయానికి సీఆర్‌డీఏ వేగం పెంచింది. నవులూరు, పిచ్చుకలపాలెంలలో నిర్దేశించుకున్న 14 ఎకరాల ఆక్షన్‌కు రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించటానికి సమాయత్తమవుతోంది. నోటిఫికేషన్‌ను బుధవారమే సీఆర్‌డీఏ అధికారులు తయారు చేశారు. సీఆర్‌డీఏ కమిషనర్ సంతకం పెట్టగానే పత్రికల్లో బహిరంగ ఆక్షన్ నోటిఫికేషన్‌ను వెలువరించటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధాని భూముల అమ్మకానికి సిద్ధం కావటం వివాదాస్పదమవుతోంది. భూ సమీకరణ కింద తీసుకున్న భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టకుండా విక్రయించకూడదు. ప్రభుత్వం ఇటీవల కాలంలో సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. ఆ చట్ట సవరణలు ఎలా ఉన్నా, హైకోర్టులో వివాదం ఉండగా ప్రభుత్వ ఏకపక్ష విధానాలు చెల్లుబాటవుతాయా అనేదే ప్రశ్న. సీఆర్‌డీఏ అధికార వర్గాల వాదన మాత్రం మరోలా ఉంది. హైకోర్టు తీర్పుననుసరించి అమరావతి అభివృద్ధి పనుల కోసమే తాము భూములను ఆక్షన్‌కు పెడుతున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం డబ్బు ఇవ్వనప్పుడు తాము సొంతంగా డబ్బు సమకూర్చుకోవాల్సి వస్తోందని, అందులో భాగమే ఈ ఆక్షన్ అంటూ వాదిస్తున్నారు.