పోలవరం ప్రాజెక్టులో గత వరదలకు ‘డయాఫ్రంవాల్’ వద్ద దెబ్బతిన్న గ్యాప్ 1, 2 ప్రాంతాల్లో ఏర్పడిన అగాధాలను పూడ్చివేసే కార్యక్రమాన్ని జలవనరుల శాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు. ప్రాజెక్టు రివ్యూ పానెల్ సూచించిన డిజైన్ ప్రకారం పూడ్చివేత పనులు ప్రారంభించినట్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు తెలిపారు. డయాఫ్రంవాల్‌కు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల వైపు కుడి, ఎడమల్లో పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో గ్యాప్ 1, 2ల వద్ద ఒక ప్రాంతంలో 26 మీటర్లు, మరోచోట 24 మీటర్ల మేర భారీ అగాధాలు ఏర్పడ్డాయని, వాటిలోకి ఇసుక నింపి అనంతరం ఆ ప్రాంతాన్ని వైబ్రో కంపాక్షన్ ద్వారా గట్టిపరుస్తారని తెలిపారు. వైబ్రో కంపాక్షన్ పనులు పూర్తయిన తర్వాత నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చే నివేదిక ఆధారంగా జెట్ గ్రౌడింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. దీనికి సమాంతరంగా కొంతమేర డయాఫ్రంవాల్ నిర్మాణం చేస్తారని, అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ పనులు ప్రారంభిస్తారని తెలిపారు.