నంద్యాల జిల్లా లో దారి తప్పి వచ్చిన పులికూనల తల్లి పులి కోసం అధికారులు గత రెండు రోజుల నుండి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ సమీపంలో పులి సంచరించినట్టు ఓ గొర్రెల కాపరి అటవీ అధికారులకు సమాచారం అందించాడు. బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని జొన్న చేను నుంచి రోడ్డు దాటి నీలగిరి చెట్లలోకి వెళ్లినట్టు తెలియజేశాడు. కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామంలోకి నాలుగు పులికూనలు దారి తప్పి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ గ్రామానికి సమీపంలోనే తల్లి పులి ఆనవాళ్లు లభించాయి. గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్‌ఎ్‌సటీఆర్) ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు అక్కడికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు.