వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలపై అదే పార్టీకి చెందిన ఎంపీ భరత్ రామ్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తాను తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరోగా చేయగలనని, అది పెద్ద గగనమేమీ కాదని అన్నారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్. ఎంపీ రఘురామకృష్ణరాజు తనను ఉద్దేశించి చేసిన ‘ఏకచిత్ర నటుడు’ అనే విమర్శను తిప్పికొడుతూ భరత్ ఈ విధంగా మాట్లాడారు. కావాలంటే తన సినిమాలో రఘురామకృష్ణరాజుకు ఒక కమెడియన్ పాత్ర ఇస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు.
‘రఘురామకృష్ణరాజు నిన్న ఏదో వాగుతున్నాడు. ఏకచిత్ర నటుడు అని నోటికొచ్చింది వాగుతున్నాడు. నేను కావాలనుకుంటే, తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరోగా చేయగలను. ఇదేం పెద్ద గగనమేమీ కాదు. ఏకచిత్ర కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను. నాకున్న ఫేస్ గ్లామర్‌కి ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. కావాలంటే నీకు కూడా ఒక పాత్ర ఇస్తాను. నువ్వో గోచీ కడతావు కదా. నీకన్నా పెద్ద నటుడు ఎవ్వడూ లేడు. అరిటాకు స్టోరీ ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పార్లమెంట్‌లో తెలుగురాని సహచర ఎంపీలు కూడా ఇతని అరిటాకు చిరిగిపోయిన యాక్టింగ్ చూస్తూ ఉంటారు. నువ్వు కామెడీ స్టార్‌కి ఎక్కువ.. ఎందుకూ పనికిరాని స్టార్‌కు తక్కువ. ఇవన్నీ ఫస్ట్ తెలుసుకో’ అంటూ భరత్ కౌంటర్ ఇచ్చారు.
తాను తులచుకుంటూ 10 సినిమాల్లో హీరోగా నటించి.. ఆ పది సినిమాలను సూపర్ హిట్లు చేయగలుగుతానని చెప్పిన భరత్.. రఘురామకృష్ణరాజు కామెడీ యాక్టర్‌గా కూడా పనికిరారని వ్యాఖ్యానించారు. ‘జగన్‌మోహన్ రెడ్డి గారిని పర్మిషన్ అడిగి నేను సినిమాలు చేయడం పెద్ద విషయం కాదు. ఏకచిత్ర నటుడు ఏంట్రా.. 10 సినిమాలు చేయగలుగుతాను. సూపర్ స్టార్ కింద చేయగలుగుతాను. ఆ టాలెంట్ ఉంది నాకు. అన్ని రంగాల్లో టాలెంట్ ఉంది. నువ్వేంటి వాగేది. కాస్త నోరు అదుపులో పెట్టుకో’ అంటూ భరత్ విరుచుకుపడ్డారు.
అయితే, ఎంపీ భరత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సార్‌కి బాగా కాలినట్టుందని.. అందుకే సూపర్ స్టార్ అని పెద్ద పెద్ద మాటలు అంటున్నారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. పూరీ జగన్నాథ్‌కు హీరోలు దొరకక ఖాళీగా ఉన్నాడని.. పిలిచి ఒక అవకాశం ఇవ్వాలని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ‘కె.జి.యఫ్ 3’లో మీరే హీరోగా చేయాలి అంటూ మరో నెటిజన్ వెటకారంగా కామెంట్ పెట్టాడు. ఇలాంటి కామెంట్లు చాలానే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ‘ఓయ్ నిన్నే’ అనే సినిమాతో మార్గాని భరత్ హీరోగా పరిచయం అయ్యారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అసలు భరత్ హీరోగా సినిమా వచ్చినట్టు చాలా మందికి తెలీదు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో భరత్‌కు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రాలేదు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. యువనేతగా మంచి పాపులారిటీ సంపాదించారు.