వై.ఎస్.వివేకా హత్య కేసు విషయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు. న్యాయవాది సమక్షంలోనే సీబీఐ విచారణ జరిగేలా చూడాలని ఈ పిటీషన్‌లో విజ్ఞప్తి చేశారు. తనకు 150 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు ఇచ్చిందని..ఈ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు కోరారు. ఈనెల 10న అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఏపీలో ఉంటే న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని.. వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె కోరారు. దీంతో ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఇటీవల విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ.. సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత దస్తగిరి అప్రూవర్ గా మారాడు.