రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై అవినీతి రాజ్యమేలుతోంది. దుర్గమ్మను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. తమ మొక్కులు చెల్లించుకుని.... దుర్గాదేవిని దర్శించుకుంటారు. అయితే.. తమ నమ్మకాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు.
ఇంద్రకీలాద్రి కేశఖండన శాలలో.. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల సెంటిమెంటును ఆసరాగా చేసుకొని.. కొందరు సిబ్బంది డబ్బులు దండుకుంటున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు టికెట్ ధర 25 రూపాయలు ఉంది. అయితే.. ఆ టికెట్ తీసుకుని కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించుకోవాలంటే.. మళ్లీ సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిందే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
భక్తుల తలపై కత్తెర పెట్టాలంటే.. టికెట్ కాకుండా.. మరో 500 ఇచ్చుకోవాల్సిందే అని అమ్మవారి భక్తులు ఆరోపిస్తున్నారు. టోకెన్ ఉంది కదా అని ప్రశ్నించినా.. 5 వందలు ఇస్తేనే తలనీలాలు తీస్తామి.. లేకపోతే లేదు అని చెబుతున్నారట. ఇదేంటని గట్టిగా మాట్లాడితే.. తలపై గాట్లు పెడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ కేశఖండన శాలలో ఇదే తంతు అని భక్తులు వాపోతున్నారు. దీనిపై ఆలయ అధికారులు దృష్టి పెట్టాలని.. డబ్బులు డిమాండ్ చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.