మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన మూడోసారి విచారణ కోసం వెళ్లారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. వై.ఎస్.అవినాష్ రెడ్డి విచారణ కోసం వెళ్తున్న సమయంలో.. ఆయన అనుచరులు భారీగా కోఠి సీబీఐ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ.. అవినాష్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైనా హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరిస్తున్నాడని అతని తరపు లాయర్ వివరించారు. దీంతో అవినాష్ రెడ్డి ఇప్పుడు సీబీఐ కార్యాలయంలోనే ఉన్నాడా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్ విచారణలో ఆసక్తికర సంభాషణ జరిగింది. సీసీ కెమెరాల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు హైకోర్టు న్యాయమూర్తి. కోడి కత్తి కేసులో ఎయిర్ పోర్టులో 30 కెమెరాలు పనిచేయడం లేదని సీఐఎస్ఎఫ్ కోర్టుకు తెలిపిందన్నారు.
ఇదే సమయంలో.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారించింది సీబీఐ కోర్టు. నలుగురు నిందితులు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, శివ శంకర్ రెడ్డి, ఉమాశంకర్ లను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే.. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.