వింత వాదనలు తెరపైకి తేవడం బీజేపీ నేతలకే చెల్లుతుంది. ఇదిలావుంటే మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న కర్ణాటకలో అప్పుడే రాజకీయం వేడెక్కింది. పోటాపోటీ సభలు, వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక పర్యటనకు వచ్చిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ.. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసలు కరెంటే ఇవ్వలేదని, అందువ్లే జనాభా పెరిగిందని ఆయన అన్నారు. ప్రహ్లాద్ జోషీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వాళ్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటే మీరు నమ్ముతారా? వారు అధికారంలో ఉన్నప్పుడు అసలు కరెంటే ఇచ్చేవారు కాదు. గ్రామాల్లో విద్యుత్ ఉండేది కాదు. అందువల్లే జనాభా పెరిగిపోయింది’ అని ప్రహ్లాద్ జోషి అన్నారు. అంటే.. కరెంట్ ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రజలు చీకట్లో ఉండి, శృంగార కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల జనాభా పెరిగిందని మంత్రి గారి వ్యాఖ్యల పరమార్థం కాబోలు! నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాకే 24 గంటల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు. కర్ణాటకలో మరోసారి బీజేపీకే అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు.
తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. జనవరిలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ‘ప్రజా ధ్వని యాత్ర’ ప్రకటన సందర్భంగా ఈ హామీ ఇచ్చింది. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆ వార్తకు సంబంధించిన క్లిప్‌ను రీట్వీట్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.