వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడుగా ఎన్నికై జీ జిన్‌పింగ్ (69) చరిత్ర సృష్టించారు. జిన్పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ చైనా పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా గతేడాది అక్టోబరులోనే ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు జిన్‌పింగ్ మాత్రమే. జిన్పింగ్ తన జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగే యోచనలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం వేయడం వల్ల చైనా పార్లమెంట్ను రబ్బర్ స్టాంపుగా అభివర్ణిస్తున్నారు.
తొలిసారి 2012లో చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన చైనా చరిత్రలో అత్యంత ఉదారవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడని కొందరు పరిశీలకులు అంచనా వేశారు. కుటుంబ నేపథ్యం, నాటి వ్యక్తిగత ప్రొఫైల్ వంటివి కొంత మేరకు పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనా ఈ పదేళ్లలో తప్పని రుజువయ్యింది. మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన పాలకుడిగా ఎదిగారు. ఆధునిక చైనా ఆశయం కోసం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ.. చైనీయులు జీవితంలోని దాదాపు ప్రతి అంశంలోకి చొరబడ్డారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన జిన్‌పింగ్ అధ్యక్షుడవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆయన తండ్రి షీ జాంగ్జన్ వైస్ ప్రీమియర్‌గా మారిన విప్లవ వీరుడు. ‘తన కుటుంబసభ్యుల పట్ల కఠినంగా వ్యవహరించేవారు.. అతనికి దగ్గరగా ఉన్నవారు కూడా ఇదే విషయం చెప్పారు’ అని షీ జీవిత చరిత్ర రచయిత జోసెఫ్ టోరిజియన్ వ్యాఖ్యానించారు..
‘మావోలు చేపట్టిన సాంస్కృతిక విప్లవం సమయంలో జాంగ్జన్ లక్ష్యంగా చేసుకున్నప్పుడు జీ జిన్‌పింగ్, అతని కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.. రాత్రికి రాత్రే కుటుంబం అదృశ్యమైంది.. కుటుంబం చెల్లాచెదురయ్యింది. వేధింపుల కారణంగా అతని సవతి సోదరి ఒకరు ఆత్మహత్య చేసుకుంది.. తోటి విద్యార్థులతో హేళనకు గురైన జిన్‌పింగ్‌కు చిన్నతనంలోని ఈ భావోద్వేగ, మానసిక నిర్లిప్తత, అతని స్వయంప్రతిపత్తికి దోహదపడ్డాయని.
పదిహేనేళ్ల వయసులో మధ్య చైనాలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ధాన్యం సేకరిస్తూ, గుహల్లాంటి ఇళ్లలో నిద్రపోయాడు. అక్కడ ప్రజల దుర్బర పరిస్థితి దిగ్భ్రాంతికి గురిచేసిందని జిన్‌పింగ్ ఒకసారి వ్యాఖ్యానించారు. తన తండ్రికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కూడా పాల్గొన్నారు. 1974లో పార్టీ అధ్యక్షుడిగా మొదలైన జిన్‌పింగ్ ప్రస్థానం.. 1999లో ఫుజియా ప్రావిన్సులు గవర్నర్‌గా.. 2002లో జంగ్జియాంగ్ ప్రావిన్సుల పార్టీ చీఫ్‌గా.. 2007లో షాంఘై పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.