ఇటీవల కాల్పులకు పాల్పడుతున్న ఉన్మాదుల సంఖ్య పెరుగుతోంది. జర్మనీ చర్చ్‌లో ఓ ఆగంతుకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి పలువురు ప్రాణాలు తీశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు. హంబర్గ్‌లోని యెహువా విట్నెస్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతిచెందారు. వీరిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 8.15 గంటలకు ఉత్తర హంబర్గ్‌లో కాల్పుల ఘటనపై ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినట్టు పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, వీరిలో కొందరు మృతిచెందినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నేరం వెనుకున్న ఉద్దేశం గురించి కచ్చితమైన సమాచారం లేదని చెప్పారు.
కాల్పులు జరిగిన ప్రదేశాన్ని అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ప్రకటించిన పోలీసులు.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. చుట్టుపక్కల వీధుల్లోని భవనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మృతుల సంఖ్యపై పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, జర్మనీ మీడియాలు మాత్రం కనీసం ఆరుగురు చనిపోయినట్టు వార్తలను ప్రసారం చేస్తున్నాయి.
సంఘటనా స్థలంలో మొదటి పోలీసులు అనేక మృతదేహాలు, తీవ్రంగా గాయపడిన వ్యక్తులను గుర్తించారు. దీనికి ముందు భవనం పై భాగంలో ఓ వ్యక్తి తుపాకితో కాల్చుకున్న శబ్దం కూడా విన్నట్టు తెలిపారు. ‘పరారీలో ఉన్న నేరస్థుడి గురించి మాకు ఎటువంటి సమాచారం లేదని పోలీసు ప్రతినిధి చెప్పారు. అయితే, కాల్పులకు పాల్పడిన ఆగంతుకుడు కూడా మృతిచెంది ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. భవనంపై అంతస్తులో వెలికితీసిన శవం బహుశా నేరస్థుడిది కావచ్చని తెలిపారు.
స్థానిక దినపత్రిక హాంబర్గర్ అబెండ్‌బ్లాట్ ప్రకారం.. గురువారం సాయంత్రం చర్చిలో జరిగిన కార్యక్రమంలో కాల్పులు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన 17 మందిని అగ్నిమాపక దళం రక్షించినట్టు నివేదించింది. అహింసను బోధించే యెహోవా విటెన్సెస్ అమెరికన్ క్రైస్తవ ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైంది. దీని పరిధిలో హాంబర్గ్‌లోని 3,800 మంది సహా జర్మనీలో దాదాపు 175,000 మంది ఇంటింటికి సువార్త ప్రచారాలు నిర్వహిస్తుంటారు. కాగా, ఈ ఘటనపై హంబర్గ్ మేయర్ పీటర్ ట్షెంచర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.