పోలీసునంటూ మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న నకిలీ పోలీసును శుక్రవారం అల్లూరు ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి తమ సిబ్బందితో కలసి బోగోలు మండలం కడనూతల వద్ద అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అల్లూరు ఎస్‌ఐ శ్రీనివాసులు రెడ్డి, కావలి రూరల్ సీఐ రాజే్‌షతో కలిసి డీఎస్పీ వెంకటరమణ విలేకరులకు వెల్లడించిన వివరాల మేరకు... కృష్ణా జిల్లా వాత్సవాయి మండలం కాకరవాయి గ్రామానికి చెందిన బండి రామకృష్ణ చెడు అలవాట్లకు బానిసై ఇంటిని నుంచి వచ్చేసి పలు నేరాలకు పాల్పడుతున్నారు. తాను సెబ్ సీఐ అని ఒక సారి, ఐడీ పార్టీ కానిస్టేబుల్‌నని మరొకసారి చెప్పుకుంటూ పలు జిల్లాలో 5 చోట్ల మోసాలకు పాల్పడ్డాడు. ఈ నెల 3వ తేదీన అల్లూరుకు చెందిన కావలి అశోక్ కుమార్‌కు శ్రీకాళహస్తిలో పరిచయమై తాను ఐడీ పార్టీ కానిస్టేబుల్ అని చెప్పాడు. శ్రీకాళహస్తి ఆలయంలో దైవదర్శనానికి సహకరించాడు. తాను డ్యూటీ విషయంలో అల్లూరు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన అశోక్‌కుమార్‌కు ఫోన్ చేసి తాను ఒక ముద్దాయిని పట్టుకోవడానికి అల్లూరు వస్తున్నానని, మూడు రోజులు మీ ఇంట్లో షెల్టర్ కావాలని అడగడంతో పోలీసే కదా అని షెల్టర్ ఇచ్చాడు. అదే రోజు తనకు గంజాయి విక్రయంపై సమాచారం ఉందంటూ బయటకు వెళ్లాడు. ఆ రోజు దగదర్తి మండలం కౌరుగుంటలో ఎక్స్‌ఎల్ మోటారుసైకిల్ అపహరించాడు. ఈనెల 8న గంజాయిని పట్టుకోవటానికి వెళుతున్నాని అశోక్ కుమార్ హీరో మోటారుసైకిల్ తీసుకుని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ, రూరల్ సీఐ పర్యవేక్షణలో కేసు నమాదు చేసి విచారణ చేపట్టి సాంకేతిక పరిజ్ఞానంతో అతనిని అరె్‌స్ట చేసి ఆయన వద్ద ఉన్న రెండు మోటారుసైకిళ్లు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.