ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణ శుక్రవారానికి రెండోరోజుకి చేరింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు చోట్ల భోజన విరామ సమయాల్లో వారి కార్యాలయాల ఆవరణలో నిలబడి కొద్దిసేపు నినాదాలు చేశారు. విజయవాడలోని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉద్యమ కార్యాచరణ నోటీసు ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. జీతాలే సకాలంలో రాని పరిస్థితుల్లో ఉద్యమంలోకి వచ్చామన్నారు. ‘‘ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. మీరు మమ్మల్ని వంచిస్తున్నారు’ అని ఉద్యోగులు మమ్మల్ని అంటున్నారు. ఉద్యోగులు.. మమ్మల్నీ, ప్రభుత్వాన్నీ నమ్మే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే కదా ఈ పరిస్థితి తీసుకొచ్చింది’’ అని బొప్పరాజు అన్నారు.