తిరుపతిని దొంగ ఓటర్లకు కేంద్రంగా వైసీపీ మార్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చదువురాని, వేలిముద్ర వేసే 7 వేల మందిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. నగరంలోని నాలుగు పోలీసు స్టేషన్లలో నకిలీ ఓటర్లపై కేసులు నమోదు చేయాలని 16 ఫిర్యాదులు చేశామన్నారు. 34వ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డి, 12వ వార్డు కార్పొరేటర్ ఎస్.కె.బాబులు దొంగ ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. జగన్ ఆదేశాలతోనే దొంగ ఓట్లను నమోదు చేశారన్నారు. పట్టభద్రులకు ఓటుకు 500 రూపాయలు, ఉపాధ్యాయులకు 5వేల రూపాయలను వైసీపీ నేతలు పంపిణీ చేశారని ఆరోపించారు. దొంగ ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దనే పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘పట్టభద్రులు, ఉపాధ్యాయులు అధైర్యపడొద్దు.. మీ ఓటును సద్వినియోగం చేసుకోండి’’ అంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలను అపహాస్యం చేయకూడదనుకుంటే దొంగ ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావద్దన్నారు. టీడీపీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ను గెలిపించాలని సుగుణమ్మ కోరారు.