ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్.. ఓటర్లకు గేలం వేయడానికి వెండి బిస్కెట్లను సిద్ధం చేసినట్లు టీడీపీ, సీపీఎం నాయకులు ఆరోపించారు. పెద్దఎత్తున వీటిని ప్యాకింగ్ చేసి, పంపిణీకి తీసుకువెళుతున్నారంటూ శుక్రవారం రాత్రి బీచ్‌రోడ్డులోని మత్స్యదర్శిని సమీపాన, సుధాకర్ నివాసముంటున్న క్లోవ్ మెజిస్టిక్ అపార్టుమెంట్ వద్ద ఆందోళనకు దిగారు. ఒక్కో వెండి బిస్కెట్ 15 గ్రాముల బరువు (సుమారు రూ.1,000విలువ) ఉందని, ఒక్కో బ్యాగులో 50నుంచి వంద వరకు ఇలా సర్ది పంపిణీకి సిద్ధం చేశారని సీపీఎం నాయకులు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మల్లికార్జున దృష్టికి టీడీపీ నాయకులు తీసుకువెళ్లగా, రాతపూర్వకంగా ఫిర్యాదివ్వాలని సూచించారు. అనంతరం, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో సీపీఎం కార్పొరేటర్ గంగారావు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు తనిఖీలు చేయకపోవడంతో వేలాది వెండి బిస్కెట్లను సుధాకర్ ఇంటి నుంచి బయటకు తరలించారని ఆరోపించారు.