ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా పోలీస్ చట్టం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం నల్ల జీవో 1ను తీసుకువచ్చిందని జీవో 1రద్దు పోరాట ఐక్యవేదిక కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ జీవోను రద్దు చేయాలని అనేక పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నెల 20లోగా ఈ నల్ల జీవోను రద్దు చేయాలని.. లేకపోతే ఈ నెల 20న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలను కలుపుకొని ‘చలో అసెంబ్లీ’ చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ జీవోను అమలు చేయడమంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగించడమేనన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా, ఉద్యోగ సంఘాలపై ఈ జీవోను ఉపయోగించి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు.