ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలో చేరికలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబు.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వీరితో పాటు పలువురు భీమిలికి చెందిన వైసీపీ నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ ఆవిర్భావం తర్వాత ఇవే కీలక చేరికలు అని జనసేన నేతలు భావిస్తున్నారు. టీవీ రామారావు, ఈదర హరిబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇటు చేరికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. త్వరలో ఇంకొన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
టీవీ రామారావు.. రెండ్రోజుల కిందట వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనితను గెలిపిస్తే.. ఆశించిన పదవి ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పట్లో చెప్పారని.. తర్వాత కనీసం ఆయనను కలిసే అవకాశం కూడా రాలేదని టీవీ రామారావు వాపోయారు. కొందరికే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పార్టీ పదవి అయినా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం బాధ కలిగిస్తోందని.. టీవీ రామారావు వ్యాఖ్యానించారు. జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని టీవీ రామారావు చెప్పారు. కానీ.. ఆయన జనసేన పార్టీలోనే చేరారు. టీవీ రామారావు 2009లో కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2014, 2019ల్లో టికెట్ రాకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. తాజాగా.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు.