ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని సీఎం జగన్ సవాల్ చేశారని, ఆయన సవాల్ ను స్వీకరించే సత్తా జనసేన, టీడీపీకి ఉన్నాయా? అంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. జగన్ ఓ సింహం అని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే మంగళగిరిలో జనసేన బీసీ సదస్సులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా పవన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రోజుకో మాట, పూటకో వేషం వేసే పవన్ కల్యాణ్ కు చెప్పుకోవడానికి ఓ కులం అంటూ ఉందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కాపు అన్నాడు, నిన్న బీసీ అన్నాడు... ఊసరవెల్లికి సరైన పేరు పవన్ కల్యాణ్ అంటూ వెల్లంపల్లి విమర్శించారు. అన్న చిరంజీవి పార్టీ పెట్టి ఓడిపోతే, ఆ మరుసటి రోజే ఆయనను వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు.
పనికిమాలిన పవన్ కల్యాణ్, దద్దమ్మ పవన్ కల్యాణ్... ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి పదేళ్లయింది... కనీసం ఒక్క సర్పంచినైనా గెలిపించారా? అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. ప్యాకేజీకి అమ్ముడుపోయే పార్టీ జనసేన అని, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే ఏర్పాటైన పార్టీ అని విమర్శించారు.