విశాఖ నగరానికి పెట్టని కోటలా. రక్షణ వ్యవస్థకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న డాల్ఫిన్ నోస్‌పై కోస్టల్ రీసెర్చ్ సెంటర్ ను నెలకొల్పనున్నారు. రూ. 62 కోట్ల వ్యయంతో 5. 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. పరిశోధన కేంద్రంతో పాటు ఎర్త్‌సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. లేబోరేటరీ భవనం, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్‌హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్‌తో పాటు ఇతర భవనాలను నిర్మించనున్నారు. మన తీరంలో ఉన్న సమస్యలపై ముఖ్యంగా ఈ కేంద్రం పరిశోధనలు చేయనుంది. ప్రతి సమస్యపై పరిశోధనలునిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, సమస్య నివారణకు తగిన చర్యలుతీసుకుంటుంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్‌లైన్ మేనేజ్‌మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్. త్వరలోనేఆంధ్రప్రదేశ్ షోర్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను తయారు చేయనుంది. దీని ద్వారా ఏఏ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. తీరంలో ఎక్కడెక్కడ ఎంత మేర కాలుష్యం ఉంది? దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది? దీని వల్ల సముద్రాల్లో వస్తున్న మార్పులు, మడ అడవులు విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు. తదితర వాటిపై నిరంతరం పరిశోధనలు ఇకపై విశాఖ కేంద్రంగా జరగనున్నాయి.